అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి మెరుగైన రవాణా అనుసంధానం కల్పించే కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్‌ ఈ-3, స్టీల్ బ్రిడ్జిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం స్టీల్ బ్రిడ్జిలను సీఎం స్వయంగా కాలినడకన పరిశీలించారు. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో రాజధాని ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.

రాయపూడి–వెంకటపాలెం–పెనుమాక–ఉండవల్లి వరకు నిర్మాణం పూర్తైన ఈ రహదారి అమరావతి రాజధాని ప్రాంతానికి కీలక అనుసంధాన మార్గంగా నిలవనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిల ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద ముఖ్యమంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పి. నారాయణ, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ భాష్యం రామకృష్ణ, జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

అమరావతికి రాజమార్గంగా సీడ్ యాక్సెస్ రోడ్

ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణాన్ని రాష్ట్ర అభివృద్ధి విజన్‌లో తొలి విజయంగా అభివర్ణించారు. సీడ్ యాక్సెస్ రోడ్‌ రాజధానికి రాజమార్గంగా నిలుస్తుందని చెప్పారు.

రాజధాని అభివృద్ధిని మరింత విస్తరించేలా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, సీడ్ యాక్సెస్ రోడ్డును మూడో దశలో జాతీయ రహదారి–16కు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read more : రాయపూర్–విశాఖ హైవే: ఎప్పుడు పూర్తవుతుంది? ఎక్కడెక్కడి నుంచి వెళ్తుంది?

మొత్తం రూ.1,519 కోట్ల వ్యయంతో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం జరుగుతోందని సీఎం వివరించారు. అమరావతిని కాలుష్య రహిత, ఆధునిక, సాంకేతికత ఆధారిత రాజధానిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌కు కేంద్రంగా అమరావతి

అమరావతిని భవిష్యత్ సాంకేతిక రంగాలకు అనువైన నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చంద్రబాబు తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం కంప్యూటింగ్, డీప్‌టెక్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలకు అమరావతిని కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.

దేశంలోని అగ్రశ్రేణి నగరాల్లో అమరావతిని ఒకటిగా నిలపాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాజధాని కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా ఆర్థిక, సాంకేతిక, మౌలిక వసతుల కేంద్రంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

రైతుల త్యాగాలకు సీఎం ప్రశంసలు

అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా గుర్తుచేశారు. విస్తృత చర్చల అనంతరం రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని అన్నారు.

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. వారి సహకారం లేకుండా అమరావతి నిర్మాణం సాధ్యమయ్యేది కాదని అన్నారు.

2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యం

2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా, భారత్‌ను వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సీఎం పిలుపునిచ్చారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తితో ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల్లో తిరంగా ర్యాలీలను ప్రజా ఉద్యమంలా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

రైతులు, విద్యార్థులు, కార్మికులు, వ్యాపారులు తమ తమ రంగాల్లో అంకితభావంతో పనిచేస్తే రాష్ట్రం, దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు అన్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాల పరిశీలన

సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి రాయపూడిలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాన్ని కూడా పరిశీలించారు.

సీఆర్డీఏ నిర్మించిన ఈ సముదాయంలో మొత్తం 12 టవర్లు, 288 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్ సుమారు 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. భవన సముదాయంలోని మౌలిక వసతులు, ఆధునిక సౌకర్యాలను సీఎం పరిశీలించారు.

అమరావతిని ఆహ్లాదకరమైన, ఆర్థికంగా బలమైన, అన్ని ప్రాంతాల అభివృద్ధికి కేంద్రంగా నిలిచే రాజధానిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్, స్టీల్ బ్రిడ్జిల ప్రారంభంతో అమరావతి మౌలిక వసతుల అభివృద్ధిలో మరో కీలక అడుగు పడినట్లైంది.