హైదరాబాద్: బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున కుట్టు మిషన్లు అందించనున్నారు. ఒక్కో మిషన్ విలువ రూ.12 వేలు కాగా, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 100 శాతం సబ్సిడీపై అందజేయనున్నారు.
ఆగస్టు 15 నుంచి దరఖాస్తులు
ఈ పథకానికి అర్హులైన బీసీ మహిళల నుంచి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ బీసీ మహిళలకు ఇంటి నుంచే ఆదాయం పొందే అవకాశం కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని మంత్రి వివరించారు. ప్రభుత్వం అందించే కుట్టు మిషన్ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడంతో పాటు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
వీరికి ప్రాధాన్యత
లబ్ధిదారుల ఎంపికలో సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముఖ్యంగా అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులు, అలాగే కుట్టు వృత్తిలో ఇప్పటికే అనుభవం ఉన్న మహిళలకు నిబంధనల ప్రకారం ప్రాధాన్యత కల్పిస్తామని మంత్రి తెలిపారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కుట్టు మిషన్లు అందుకున్న మహిళలకు వాటిని సక్రమంగా వినియోగించుకునేందుకు అవసరమైన శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
మొదటి దశలో 1.19 లక్షల మందికి ప్రయోజనం
కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. అందువల్ల మొదటి దశలో 1.19 లక్షల మంది అర్హులకు ప్రయోజనం అందించనున్నట్లు తెలిపారు.
భవిష్యత్తులో పథకాన్ని మరింత విస్తరించి ఎక్కువ మంది బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం
మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం ద్వారా మహిళలు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి నుంచే కుట్టు పని చేసుకుని ఆదాయం పొందే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. బీసీ మహిళలను కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.
పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ
ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న ఆయన.. ప్రగతి భవన్‌కు ‘మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్’, సచివాలయానికి ‘డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం’గా పేర్లు మార్చిన విషయాన్ని గుర్తుచేశారు.
అలాగే ఈ నెల 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, పలువురు ఎమ్మెల్యేలు, వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమయాదేవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.