ఆంధ్రప్రదేశ్‌లో ఆధ్యాత్మిక, ధార్మిక మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల నూతన ఆలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వచ్చిన ప్రతిపాదనల్లో పలు ఆలయాల నిర్మాణం పూర్తికాగా.. మిగిలిన వాటి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు.

టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రతో పాటు ఉన్నతాధికారులు వర్చువల్‌గా పాల్గొన్న ఉన్నత స్థాయి సమీక్షలో ఆలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల పునరుద్ధరణ, టీటీడీ సేవల విస్తరణ, ఆలయాల డిజిటలైజేషన్ వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.

5 వేల కొత్త ఆలయాల నిర్మాణానికి వేగం

రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 వేల కొత్త ఆలయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 161 నియోజకవర్గాల నుంచి 4,192 ప్రతిపాదనలు అందినట్లు సమీక్షలో వెల్లడైంది. వీటిలో 967 ఆలయాల నిర్మాణం పూర్తయింది.

ఆలయాల నిర్మాణంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార, బలహీన వర్గాల కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తూ మూడు కేటగిరీల్లో పనులు కొనసాగుతున్నాయి.

పురాతన ఆలయాల పునరుద్ధరణ

కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని పురాతన దేవాలయాలను కూడా సంరక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెయ్యి పురాతన ఆలయాల పునరుద్ధరణ చేపట్టాలని సూచించారు.

అలాగే శివాలయాలు, శక్తి పీఠాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయాల నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో శ్రీవాణి ట్రస్ట్ నిధులను వినియోగించే అంశంపై కూడా సీఎం సూచనలు చేశారు.

ఆలయాల వివరాలన్నీ డిజిటలైజేషన్

ఆలయాల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు దేవాదాయ శాఖ, టీటీడీ పరిధిలోని దేవాలయాల సమాచారాన్ని డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న సుమారు 28 వేల ఆలయాలు, టీటీడీ పరిధిలోని 65 ఆలయాల వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని సీఎం ఆదేశించారు. ఆలయాల ఆస్తులు, నిర్వహణ, సేవలు, ఇతర ముఖ్యమైన వివరాలను డిజిటల్ వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా పారదర్శకత, సమర్థ నిర్వహణ మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

అర్చకులకు ప్రత్యేక శిక్షణ.. విగ్రహాల తయారీ కేంద్రాలు

కొత్తగా నిర్మించనున్న ఆలయాల్లో అర్చకుల కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అర్చకులకు అవసరమైన ప్రత్యేక కోర్సులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

అదేవిధంగా ఆలయాలకు అవసరమైన విగ్రహాల తయారీ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు వాటి నిర్వహణకు అవసరమైన మానవ వనరులు, ధార్మిక మౌలిక వసతులను సమాంతరంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది.

శ్రీవారి సేవకుల భాగస్వామ్యంతో కమిటీలు

టీటీడీకి అనుబంధంగా ఉన్న భక్తులు, సేవకుల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 11.8 లక్షల మంది శ్రీవారి సేవకులు, భక్తుల భాగస్వామ్యంతో ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఆలయాల నిర్వహణలో భక్తుల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు

ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని విస్తరించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇతర రాష్ట్రాల రాజధానులతో పాటు మారిషస్ వంటి దేశాల్లోనూ శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అమరావతిలో నిర్మిస్తున్న ఆలయ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంచేలా ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

టీటీడీ విద్యా, వైద్య సేవలకు విస్తరణ

టీటీడీ పరిధిలోని విద్యా, వైద్య సేవలను భారీ స్థాయిలో విస్తరించాలని చంద్రబాబు ఆదేశించారు. వివిధ వైద్య రంగాల్లో నిపుణులైన వైద్యులను ‘శ్రీవారి వైద్య సేవకులు’గా భాగస్వామ్యం చేసి వారి సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ముఖ్యంగా క్యాన్సర్, కంటి వైద్యం, ఆయుర్వేదం వంటి రంగాల్లో నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. అలాగే ప్రాణదానం ట్రస్ట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు.

టీటీడీ పరిధిలోని 33 విద్యాసంస్థల హాస్టల్ వసతిని రెట్టింపు చేయాలని కూడా నిర్ణయించారు. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.

తిరుమల, తిరుపతికి ప్రత్యేక ఆధ్యాత్మిక ఎకోసిస్టమ్

తిరుమలతో పాటు దిగువ తిరుపతిని కూడా సంప్రదాయ కల్యాణాలకు అనువైన ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. తిరుపతి ప్రాంతాన్ని మరింత సమగ్రంగా అభివృద్ధి చేస్తూ పరిపూర్ణ దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ఎకోసిస్టమ్ రూపొందించాలని ఆదేశించారు.

దేవాదాయ శాఖ, టీటీడీ సమన్వయంతో ఆలయ నిర్మాణాలు, పునరుద్ధరణ, సేవలు, విద్య, వైద్యం, ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి సంబంధించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.