పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామంలో చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. ఏళ్ల తరబడి బోదకాలు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామంలో పారిశుధ్యం, డ్రైనేజీ, రోడ్లు, పచ్చదనం, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతున్నాయి. మొత్తం రూ.4.68 కోట్లతో వివిధ శాఖల నిధులతో చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.

నాణ్యత, ప్రజల సౌకర్యానికే ప్రాధాన్యం

పెదపెంకిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా, దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని సూచించారు.

రోడ్లు, డ్రెయిన్లు వంటి నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత వాటి నిర్వహణలో లోపాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రజల్లో పారిశుధ్యంపై అవగాహన పెంచి, వారి జీవన విధానంలోనూ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

27 సిమెంటు రోడ్లు పూర్తి

పెదపెంకి గ్రామ అభివృద్ధి కోసం ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం, మండల పరిషత్, నీటిపారుదల శాఖ తదితర వనరుల నుంచి నిధులు సమకూర్చారు. ఈ నిధులతో చేపట్టిన పనుల్లో ఇప్పటికే 27 అంతర్గత సిమెంటు రోడ్లు పూర్తయ్యాయి.

పూర్తయిన అంతర్గత సిమెంటు రోడ్ల పొడవు దాదాపు ఒక కిలోమీటర్ వరకు ఉంది. అదేవిధంగా 12 సిమెంటు డ్రెయిన్లు, ఆరు డ్రెయిన్ కమ్ రోడ్ల నిర్మాణం కూడా పూర్తయింది. డ్రెయిన్ల నిర్మాణం సుమారు కిలోమీటరున్నర మేర పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

బంకూరు వీధి, చీకటి వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తవడంతో గ్రామస్తుల రాకపోకలు మరింత సులభతరమయ్యాయి.

రెండు కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లు

గ్రామంలో మురుగు నీటి సమస్యను తగ్గించేందుకు మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 48 మ్యాజిక్ డ్రెయిన్లకు ప్రణాళిక రూపొందించగా.. ఇప్పటివరకు 41 డ్రెయిన్ల నిర్మాణం పూర్తయింది.

పూర్తయిన మ్యాజిక్ డ్రెయిన్ల పొడవు దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ఉంది. మరో 670 మీటర్ల మేర ఏడు మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. తెలగ వీధి, కొత్త వీధి, పెద్ద వీధి, చీకటి వీధి, పిలక వీధి, ఎన్‌టీఆర్ కాలనీ, మెయిన్ వీధి, ఎస్టీ కాలనీల్లో చేపట్టిన డ్రెయిన్ల పనులతో మురుగు నీటి సమస్య గణనీయంగా తగ్గినట్లు అధికారులు వివరించారు.

3 వేల మొక్కలతో గ్రామానికి పచ్చదనం

పెదపెంకి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు పచ్చదనానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పాటు కోనేరు సుందరీకరణ పనులు చేపట్టారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో 3 వేలకు పైగా మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. కొబ్బరి చెట్లతో పాటు ఇతర మొక్కల పెంపకం ద్వారా గ్రామంలో పచ్చదనం పెంచే చర్యలు చేపట్టారు. మిగిలిన రోడ్లు, డ్రెయిన్ల పనులను కూడా త్వరగా పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

బోదకాలు సమస్యకు శాశ్వత పరిష్కారంపై దృష్టి

పెదపెంకిలో చాలా కాలంగా కొనసాగుతున్న బోదకాలు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. గ్రామంలో పారిశుధ్య లోపాలను సరిచేయడంతో పాటు మురుగు నీటి నిర్వహణను మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు.

ఇందులో భాగంగా వ్యక్తిగత, సామాజిక ఇంకుడు గుంతలు, కంపోస్ట్ పిట్స్ వంటి పనులు కూడా చేపట్టారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నీటి సంరక్షణను పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్

ఆరోగ్య పరిరక్షణకు కూడా పెదపెంకి అభివృద్ధి ప్రణాళికలో ప్రాధాన్యం ఇచ్చారు. బోదకాలు సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని గ్రామంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య వివరాలను సేకరించి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

ప్రజల ఆరోగ్య పరిస్థితిని వ్యక్తిగత స్థాయిలో గుర్తించి భవిష్యత్తులో అవసరమైన ఆరోగ్య చర్యలు చేపట్టేందుకు ఈ డిజిటల్ ప్రొఫైల్స్ ఉపయోగపడే అవకాశం ఉంది.

పెదపెంకి గ్రామాన్ని పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, పచ్చదనం, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పనులను ముందుకు తీసుకెళ్లడంలో సవాళ్లు ఎదుర్కొన్న అధికారులను ఆయన అభినందించారు. త్వరలో గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి నిర్మించిన రోడ్లు, డ్రెయిన్ల నాణ్యతను స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.