రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి కాలుష్యానికి సంబంధించి ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి పెద్ద మొత్తంలో ద్రవ వ్యర్థాలు వెలువడుతున్నాయని, అదే సమయంలో స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన పన్నులు కూడా బకాయి పెట్టారని ఆరోపించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇప్పటికే పలుమార్లు పరిశ్రమ ప్రతినిధులతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఇచ్చినా స్పందన లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కంపెనీకి సమన్లు జారీ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రాజమహేంద్రవరం ద్రవ వ్యర్థాల్లో సగం పరిశ్రమ నుంచే..

రాజమహేంద్రవరం నగరంలో రోజుకు సుమారు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందులో సుమారు 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలు ఆంధ్రా పేపర్ లిమిటెడ్ నుంచే వస్తున్నాయని అధికారిక గణాంకాలను ఉటంకించారు. ఈ పరిస్థితి గోదావరి నదీ పర్యావరణంపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థాల్లో కొన్ని కాలుష్య కారకాల స్థాయులు నిర్దేశిత ప్రమాణాలను మించి ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని పవన్ పేర్కొన్నారు. లగూన్ల సమీపంలో సేకరించిన నమూనాల్లో బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) లీటరుకు 36 మిల్లీగ్రాములు నమోదైందని తెలిపారు.

ఫాస్ఫేట్, సల్ఫైడ్స్‌ స్థాయులపై ఆందోళన

పరీక్షల్లో ఫాస్ఫేట్ స్థాయి లీటరుకు 5.3 మిల్లీగ్రాములుగా నమోదైందని పవన్ వెల్లడించారు. ఇది నిర్ణీత పరిమితి కంటే 6 శాతం అధికంగా ఉందని చెప్పారు. అలాగే సల్ఫైడ్స్ స్థాయి 3.4 మిల్లీగ్రాములుగా నమోదైందని, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలతో పోలిస్తే ఇది 70 శాతం అధికమని పేర్కొన్నారు.

వ్యర్థాల్లో కాలుష్య కారకాల మోతాదు పెరగడం వల్ల నీటిలో ఆక్సిజన్ స్థాయులు తగ్గే అవకాశం ఉందని, దీంతో జలచరాల మనుగడకు ఇబ్బందులు ఏర్పడతాయని పవన్ కల్యాణ్ అన్నారు. గోదావరి సహజ పర్యావరణ వ్యవస్థను కాపాడటంతో పాటు నీటి నాణ్యత, భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు అవసరమని స్పష్టం చేశారు.

2016 నుంచి పన్నులు చెల్లించలేదన్న ఆరోపణ

పర్యావరణ అంశంతో పాటు ఆంధ్రా పేపర్‌పై స్థానిక పన్నుల బకాయిలను కూడా పవన్ ప్రస్తావించారు. 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీకి లేదా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు కంపెనీ ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదని ఆయన ఆరోపించారు.

స్థానిక సంస్థలకు కంపెనీ నుంచి సుమారు రూ.21.34 కోట్ల వరకు పన్నులు రావాల్సి ఉందని తెలిపారు. పన్నులు చెల్లించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేసిన ప్రతిసారీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని పవన్ విమర్శించారు.

సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా స్పందన లేదన్న పవన్

పరిశ్రమపై వెంటనే కఠిన చర్యలు తీసుకోకుండా, ముందుగా సమస్యలను సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని పవన్ కల్యాణ్ చెప్పారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గత మూడు నెలల్లో పరిశ్రమ ప్రతినిధులతో పలుమార్లు సమావేశమై అవసరమైన సూచనలు, పరిష్కార మార్గాలను వివరించారని తెలిపారు.

అయినప్పటికీ కంపెనీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో తాను క్షేత్రస్థాయి పర్యటనలో భూగర్భ జలాలు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించినప్పటికీ వాటిని కూడా అమలు చేయలేదని ఆరోపించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిన పరిశ్రమలపై కార్యకలాపాల నిలిపివేత, జరిమానాలు, ఇతర చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పవన్ స్పష్టం చేశారు. అవసరమైతే పరిశ్రమను సీజ్ చేయడం, లైసెన్స్ రద్దు వంటి చర్యలు కూడా నిబంధనల పరిధిలో ఉంటాయని పేర్కొన్నారు.

అయితే పరిశ్రమలను ఇబ్బందులకు గురిచేయకూడదన్న ఉద్దేశంతో తొలుత షోకాజ్ నోటీసులు జారీ చేసి సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు కూడా స్పందన లేకపోవడంతో తదుపరి చర్యలకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

ఆంధ్రా పేపర్‌కు సమన్లు.. కేసులపై వేగం

ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌కు తక్షణం సమన్లు జారీ చేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల విచారణ త్వరగా పూర్తయ్యేలా అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

గోదావరి నదిని కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు పర్యావరణవేత్తలు, పౌర సమాజం మద్దతు ఇవ్వాలని పవన్ కోరారు. ‘స్వచ్ఛ గోదావరి-పవిత్ర పుష్కరాలు’ లక్ష్యంతో నదీ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం కఠినంగా ముందుకు సాగుతుందని తెలిపారు.