ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆంధ్రప్రదేశ్‌లో కీలక పర్యటన చేపట్టనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా రూ.17,900 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా నిర్వహించనున్నారు. ఈ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఈ కార్యక్రమం ద్వారా ఉత్తరాంధ్రలో విమానయాన, రహదారులు, విద్యుత్, పరిశ్రమల అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వేలాది మంది ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉండటంతో సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్

ఉదయం 10:45 గంటలకు
ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆయనకు స్వాగతం పలుకుతారు.

10:50 – 10:55 గంటల మధ్య
విమానాశ్రయం టెర్మినల్ భవనానికి చేరుకుని ప్రారంభ కార్యక్రమాలకు హాజరవుతారు.

10:55 – 10:58 గంటల మధ్య
దాదాపు 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ప్రధానికి సాంప్రదాయ స్వాగతం పలుకుతారు.

11:00 – 11:15 గంటల మధ్య
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించి, టెర్మినల్ భవనం, ఇతర సౌకర్యాలను పరిశీలిస్తారు.

11:17 – 11:25 గంటల మధ్య
ఓపెన్ టాప్ వాహనంలో సభా వేదికకు చేరుకుంటారు. మార్గమధ్యంలో వేలాది మంది ప్రజలు, గిరిజన కళాకారులు, మహిళలు ఆయనకు స్వాగతం పలకనున్నారు.

11:30 – మధ్యాహ్నం 12:55 వరకు
బహిరంగ సభలో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, పెట్టుబడులపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.

మధ్యాహ్నం 1:05 గంటలకు
ప్రత్యేక విమానంలో భోగాపురం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. మొత్తం పర్యటన సుమారు 2 గంటల 25 నిమిషాలు కొనసాగనుంది.

విమానాశ్రయం ప్రారంభంతో పాటు పలు జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. రహదారులు, విద్యుత్ ప్రసార వ్యవస్థ, పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్ తయారీ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తాయని అధికారులు చెబుతున్నారు.

ప్రారంభోత్సవంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కూచిపూడి నృత్యంతో పాటు గిరిజన కళారూపాలు, జానపద ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. భోగాపురం విమానాశ్రయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ సంప్రదాయాలను ప్రతిబింబించేలా అలంకరించారు.