హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (MCR TIMS) ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కలిసి నేడు సాయంత్రం 4.30 గంటలకు TIMS ఆసుపత్రిని ప్రారంభించనున్నారు.

సనత్‌నగర్‌లో భారీ ప్రభుత్వ ఆసుపత్రి

సుమారు 22.6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన MCR TIMSలో మొత్తం 1,082 పడకలు ఉన్నాయి. ఇందులో 300 ICU పడకలు ఉండటం ఆసుపత్రి సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. అత్యవసర, క్లిష్టమైన కేసులకు వేగంగా చికిత్స అందించేందుకు 31 ప్రధాన, 6 చిన్న ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు.

ఈ ఆసుపత్రి అధునాతన వైద్య సేవలతో కూడిన సమగ్ర మెడికల్‌ క్యాంపస్‌గా రూపొందింది. గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు, అవయవ మార్పిడి, క్యాన్సర్, న్యూరోసైన్సెస్‌, ట్రామా కేర్‌ వంటి కీలక విభాగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఆరు సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌

MCR TIMSలో ఆరు Centres of Excellence ఏర్పాటు చేశారు. అవయవ మార్పిడి, కార్డియాక్‌ సైన్సెస్‌, ఆంకాలజీ, న్యూరోసైన్సెస్‌, నెఫ్రాలజీ, ట్రామా కేర్‌ విభాగాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారు.

దీంతో క్లిష్టమైన ఆరోగ్య సమస్యలకు ఒకే చోట అధునాతన నిర్ధారణ, చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుండె, కిడ్నీ, క్యాన్సర్‌, అవయవ మార్పిడి వంటి చికిత్సలకు ఈ ఆసుపత్రి కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది.

AI ఆధారిత టెక్నాలజీ ప్రత్యేకత

ఆసుపత్రిలో AI-enabled pneumatic tube systemను కూడా ఏర్పాటు చేశారు. రక్త నమూనాలు, మందులు, వైద్య నివేదికలు, అత్యవసర సామగ్రిని వార్డులు, ల్యాబొరేటరీలు, ఫార్మసీ, బ్లడ్‌ బ్యాంక్‌ మధ్య వేగంగా తరలించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.

ఈ వ్యవస్థ ద్వారా అవసరమైన వస్తువులను ఒకటి నుంచి రెండు నిమిషాల్లో సంబంధిత విభాగాలకు చేరవేయవచ్చని అధికారులు తెలిపారు. దీంతో వైద్య పరీక్షల్లో ఆలస్యం తగ్గడంతో పాటు నమూనాలు కలుషితం అయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

MCR TIMSలో 30 క్లినికల్‌ విభాగాలతో పాటు విస్తృతమైన ల్యాబొరేటరీ నెట్‌వర్క్‌ ఉంది. 3.0 Tesla MRI, 128-slice CT స్కానర్‌, అధునాతన మామోగ్రఫీ యూనిట్‌, ఐదు X-ray యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.

అలాగే రెండు క్యాథెటరైజేషన్‌ ల్యాబొరేటరీలు, లీనియర్‌ యాక్సిలరేటర్‌ ఆధారిత రేడియోథెరపీ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు.