కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇథనాల్ విధానం దేశంలోని రైతులకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతోందని బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మిన్ బస్వా అన్నారు. ఈ విధానం ద్వారా చెరకు, మొక్కజొన్న, తడిసిన ధాన్యం, వరి గడ్డి వంటి వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ అవశేషాలను ఇథనాల్ తయారీకి వినియోగించే అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు.

ఆయన మాట్లాడుతూ.. గతంలో మార్కెట్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్న లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు కూడా ఇప్పుడు వినియోగం ఏర్పడుతోందని తెలిపారు. దీంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోందని, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్కెట్ అందుబాటులోకి వచ్చిందని వివరించారు.

చక్కెర కర్మాగారాల ద్వారా రైతులకు చెల్లించాల్సిన బకాయిల సమస్యను కూడా ఇథనాల్ విధానం కొంత మేర తగ్గించిందని లక్ష్మిన్ బస్వా అన్నారు. ఇథనాల్ ఉత్పత్తి పెరగడం వల్ల చక్కెర పరిశ్రమలకు అదనపు ఆదాయ వనరులు లభిస్తున్నాయని, దాని ఫలితంగా రైతులకు చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ విధానం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని లక్ష్మిన్ బస్వా అన్నారు. దీంతో విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని, ఆ నిధులను దేశంలో రోడ్లు, రైల్వేలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడితే వాహనాలకు నష్టం జరుగుతుందని జరుగుతున్న ప్రచారాన్ని లక్ష్మిన్ బస్వా ఖండించారు. అలాంటి వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని, ప్రజలు అపోహలను నమ్మవద్దని ఆయన సూచించారు. ఇథనాల్ మిశ్రమ ఇంధనంపై కేంద్ర ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తున్న విధానం ప్రకారం వాహన తయారీ సంస్థలు కూడా తగిన సాంకేతిక మార్పులతో వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో అధికంగా పండే వరి, మొక్కజొన్న, చెరకు పంటలకు ఇథనాల్ పరిశ్రమలు మంచి మార్కెట్‌గా మారే అవకాశం ఉందని లక్ష్మిన్ బస్వా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యం, మిగులు పంటలను కూడా వినియోగించుకునే అవకాశం లభిస్తుందని, దీనివల్ల రైతులకు ఆర్థిక భరోసా పెరుగుతుందని తెలిపారు.

ఇథనాల్ పరిశ్రమల విస్తరణతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లక్ష్మిన్ బస్వా అన్నారు. ఇథనాల్ విధానం కూడా అదే దిశగా అమలు చేస్తున్న కీలక సంస్కరణల్లో భాగమని ఆయన తెలిపారు.