తెలంగాణ ప్రజల ఆస్తిగా భావించే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణి దక్కించుకుంది. ఈ విజయంపై అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పందిస్తూ, ఇది సింగరేణి చరిత్రలో ఒక కీలక మైలురాయిగా అభివర్ణించారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సింగరేణి పరిరక్షణ, విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. గత 30 నెలలుగా సంస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, అందులో భాగంగానే ఈ రోజు మణుగూరు బొగ్గు బ్లాక్‌ను సొంతం చేసుకోవడం సాధ్యమైందన్నారు.
120 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు
మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్‌లో సుమారు 120 మిలియన్ టన్నుల జీ-8 గ్రేడ్ నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ గనిలో నుంచి ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున 20 సంవత్సరాల పాటు బొగ్గు వెలికితీయవచ్చని చెప్పారు. ఈ బొగ్గు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు.
2 వేల మందికి ఉపాధి భరోసా
ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 2 వేల మంది కార్మికులకు దీర్ఘకాలిక ఉపాధి భద్రత లభించనుందని మంత్రి వెల్లడించారు. మణుగూరు ప్రాంతంలో గనుల కార్యకలాపాలు కొనసాగడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుందని చెప్పారు. ఈ బ్లాక్‌తో మణుగూరు ఏరియా కార్యకలాపాలు మరో రెండు దశాబ్దాల పాటు కొనసాగేందుకు అవకాశం ఏర్పడిందన్నారు.
నెల రోజుల్లో రెండు కీలక విజయాలు
ఇటీవలే ఒడిశాలోని నైనీ బొగ్గు గనిలో ఉత్పత్తిని ప్రారంభించడం, అలాగే తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు పొందడం వంటి విజయాల తర్వాత ఇప్పుడు మణుగూరు బ్లాక్ కూడా దక్కడంతో, నెల రోజుల వ్యవధిలో సింగరేణి రెండు చారిత్రక విజయాలను నమోదు చేసుకుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ, గతంలో నిలిచిపోయిన నైనీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు స్వయంగా ఒడిశాకు వెళ్లి అక్కడి ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలతో చర్చించి అనుమతులు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌కు పెండింగ్‌లో ఉన్న మైనింగ్ లీజులను కూడా తమ ప్రభుత్వం కేంద్రంతో సంప్రదించి మంజూరు చేయించిందన్నారు.
సింగరేణి విస్తరణే ప్రభుత్వ లక్ష్యం
సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరిన్ని బొగ్గు బ్లాక్‌లను దక్కించుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని భట్టి విక్రమార్క తెలిపారు. తదుపరి కోయగూడెం-3, సత్తుపల్లి-3 బ్లాక్‌లను కూడా సింగరేణికి దక్కేలా చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు.
సింగరేణి బలోపేతం కేవలం సంస్థ అభివృద్ధికే కాకుండా తెలంగాణ ఇంధన భద్రత, పారిశ్రామిక పురోగతి, వేలాది కుటుంబాల జీవనోపాధికి కూడా కీలకమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సంస్థ విస్తరణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు.