ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను ప్రభావం కొనసాగుతోంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినగా, మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుపాను కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేయడంతో రాష్ట్రంలో అప్రమత్తత మరింత పెరిగింది.
రాబోయే ఏడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, యానాంలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. తీర ప్రాంతాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే తుపాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు మరోసారి వర్షాల హెచ్చరికతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
కోస్తాంధ్రలో తుపాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. బాపట్ల నుండి మన్యం జిల్లా వరకు వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం. ఈదురుగాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి. రహదారులపై చెట్లు పడటంతో కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచివేయబడ్డాయి.
తీర ప్రాంతాల్లో రక్షణ గోడలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ఉధృతికి రహదారులు కొట్టుకుపోవడంతో ప్రజలకు రవాణా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నదులు, ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం యానాం లోను భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే సూచనలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుపాను కారణంగా ఇళ్ల నుండి బయటకు ఎక్కువ తిరగకూడదు అని అధికారుల చూచనలను పాటించాలని ప్రభుత్వం కోరింది.
రాయలసీమలోనూ వర్షాలు
కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే ఏడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులుతో కూడిన వర్షాలు నమోదు అవుతాయి అని వాతావరణ శాఖ తెలిపింది.
వర్షాల కారణంగా తెగిపడిన విద్యుత్ స్తంభాలకు, వైర్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువ వరద నీరు ప్రవేశించే రహదారులపై ప్రయాణాలు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు వర్షాల పరిస్థితిని గమనిస్తూ సురక్షితంగా ఉండాలని కోరుతున్నారు.
తుపాను పరిస్థితులపై ప్రభుత్వ పర్యవేక్షణ
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఏపీ ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్లి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటున్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితులు ఉంటే వెంటనే స్పందించాలని ఆదేశిస్తున్నారు.
పునరావాస కేంద్రాల్లో బాధితులకు అవసరమైన సౌకర్యాలు అందించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం సూచిస్తున్నారు. తుపాను ప్రభావం తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ కల్యాణ్ సూచన
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అధికారులకు సహకరించాలని, బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు.
కాకినాడ జిల్లా కలెక్టర్‌తో పవన్ కల్యాణ్ మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. కోస్తా జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
రహదారులపై పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించడంలో సిబ్బందికి సహకరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తుపాను బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అధికారులకు అండగా ఉండాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
పునరావాస కేంద్రాల్లో బాధితులకు సాయం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తూ పునరావాస కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలను పరిశీలిస్తున్నారు.
ప్రజలకు అవసరమైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారులను అభినందించారు.
తుపాను ప్రభావం తగ్గే వరకు బాధితులకు అవసరమైన సహాయం అందించాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు.
విమానాలు, రైళ్ల రద్దుతో ప్రయాణికులకు ఇబ్బందులు
తుపాను ప్రభావంతో విమాన, రైలు ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే 33 విమాన సర్వీసులు రద్దయినట్లు సమాచారం. భోగాపురం, గన్నవరం విమానాశ్రయాల నుంచి నడిచే కొన్ని సర్వీసులను నిలిపివేశారు.
మరోవైపు సుమారు 100 రైళ్లు రద్దయినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసినట్లు సమాచారం.
ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు విమానయాన సంస్థలు, రైల్వే అధికారుల నుంచి తాజా సమాచారం తెలుసుకోవాలి. రద్దయిన సర్వీసుల వివరాలను పరిశీలించకుండా ప్రయాణానికి బయలుదేరితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు వాతావరణ శాఖ సూచనలను పాటించాలి.
అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. వరద నీరు ప్రవహించే రహదారులపై వెళ్లకూడదు. ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్త పడాలి. విద్యుత్ వైర్లు తెగిపడిన ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అధికారులు జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ ఉండాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి.
ఆంధ్రప్రదేశ్‌లో తుపాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వర్షాలు, వరదల పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రజలు కూడా అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.