ఉదయం లేవగానే ఏమీ తినకుండా నేరుగా టీ తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. అయితే ఇలా తరచుగా చేయడం వల్ల కొందరిలో కడుపులో అసౌకర్యం, గ్యాస్, మంట వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో బలమైన టీ తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ప్రభావం పడొచ్చని సూచిస్తున్నారు.
టీ కంటే చక్కెరే అసలు సమస్య
టీని పరిమితంగా తాగితే పెద్దగా ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ అందులో అధికంగా చక్కెర కలపడం వల్లే ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. రోజూ ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు క్యాలరీలు చేరి బరువు పెరగడంతో పాటు టైప్-2 మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఉదయాన్నే టీ తాగేవారు ఇలా చేయండి
టీ తాగే ముందు ఒక గ్లాస్ నీరు తాగడం మంచిది. వీలైతే టీతో పాటు కొన్ని డ్రైఫ్రూట్స్, పండ్లు లేదా తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి. అలాగే చక్కెర పరిమాణాన్ని తగ్గించడం లేదా బెల్లం వంటి ప్రత్యామ్నాయాలను పరిమితంగా ఉపయోగించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
రోజుకు ఎంత టీ తాగితే మంచిది?
ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం రోజుకు రెండు నుంచి మూడు కప్పుల వరకు టీ తాగడం సాధారణంగా సురక్షితంగా భావిస్తారు. అయితే ఎక్కువ కప్పులు తాగడం వల్ల శరీరంలో కెఫిన్ మోతాదు పెరిగి నిద్రలేమి, ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి?
మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్, అధిక రక్తపోటు లేదా గర్భిణీలు టీ తీసుకునే విషయంలో వైద్యుల సలహా పాటించడం మంచిది. అలాగే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారం తర్వాత టీ తాగడం మరింత ఆరోగ్యకరమైన అలవాటు అని నిపుణులు సూచిస్తున్నారు.