తెలంగాణలో డిజిటల్ పాలనను మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా, పారదర్శకంగా అందించేందుకు మీ సేవ కేంద్రాలను ఆధునీకరించడంతో పాటు డిజిటల్ మౌలిక వసతులను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారం ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌కు చెందిన డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్తరణ, సాంకేతిక మౌలిక వసతుల అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు.

డిజిటల్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం

‘డిజిటల్ ఇండియా – వికసిత్ భారత్ 2047’ లక్ష్యాల సాధనలో భాగంగా తెలంగాణను దేశంలోనే అగ్రగామి డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను సమావేశంలో సమీక్షించారు. మీ సేవ కేంద్రాల ఆధునీకరణ, ప్రభుత్వ సేవలను పూర్తిగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందించడం, ప్రజలకు సులభమైన సేవలను అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలపై అధికారులు చర్చించారు.

ఏఐ, సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృత్రిమ మేధస్సు (AI), సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI), డేటా గవర్నెన్స్ రంగాల్లో తెలంగాణను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని సమావేశంలో ప్రస్తావించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త డేటా సెంటర్ల ఏర్పాటు, యువతకు ఐటీ ఆధారిత ఉపాధి అవకాశాల కల్పనపై కూడా చర్చ జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ గవర్నెన్స్ కార్యక్రమాలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అభినందించారు. సాంకేతిక సహకారం, అంతర్జాతీయ ఉత్తమ విధానాల అమలు, డిజిటల్ సామర్థ్యాల పెంపు వంటి అంశాల్లో ప్రపంచ బ్యాంక్ భాగస్వామ్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

అలాగే దేశంలో డిజిటల్ పెట్టుబడులకు తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (DPRలు) సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు.

సమావేశం అనంతరం ప్రధాన కార్యదర్శి టి-ఫైబర్ ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించే ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

వివిధ శాఖల మధ్య సమన్వయంతో పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. టి-ఫైబర్ పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు, డిజిటల్ ప్రభుత్వ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి.

ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, యువతకు సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ దిశగా ప్రపంచ బ్యాంక్‌తో భాగస్వామ్యం తెలంగాణ డిజిటల్ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు.