వైభవ్ మెరుపు ఇన్నింగ్స్.. మూడు రికార్డులు సొంతం

గురువారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన దూకుడు బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి టీమిండియా విజయానికి బలమైన పునాది వేశాడు. 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన వైభవ్.. ఆ వెంటనే ఔటైనప్పటికీ, తన మెరుపు ఇన్నింగ్స్‌తో ప్రపంచ క్రికెట్‌లో అరుదైన మూడు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

సచిన్ రికార్డును చెరిపేసిన వైభవ్

ఐసీసీ పూర్తి సభ్య దేశాల తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లు కలిపి) అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 118 రోజుల వయసులో ఈ ఘనత సాధించి ప్రపంచ క్రికెట్‌లో కొత్త మైలురాయిని నెలకొల్పాడు.

అదే సమయంలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట 37 ఏళ్లుగా కొనసాగుతున్న రికార్డును కూడా అధిగమించాడు. 1989లో ఫైసలాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో సచిన్ 16 ఏళ్ల 213 రోజుల వయసులో అర్ధశతకం సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డు వైభవ్ పేరిట నమోదైంది.

కుశాల్ మల్లా రికార్డుకూ చెక్

ప్రపంచ క్రికెట్‌లో అతి చిన్న వయసులో అంతర్జాతీయ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నేపాల్‌కు చెందిన కుశాల్ మల్లా పేరిట ఉన్న రికార్డును కూడా వైభవ్ అధిగమించాడు. మల్లా 2020లో అమెరికాపై జరిగిన వన్డేలో 15 ఏళ్ల 340 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు వైభవ్ 15 ఏళ్ల 118 రోజులకే ఆ రికార్డును బద్దలు కొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

టీ20ల్లో అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్లు

వైభవ్ సూర్యవంశీ (భారత్) – 15 ఏళ్ల 118 రోజులు (జింబాబ్వేపై, 2026)
లూయిస్ బ్రూస్ (జిబ్రాల్టర్) – 16 ఏళ్ల 56 రోజులు (మాల్టాపై, 2021)
కవిన్ చద్దా (ఇండోనేషియా) – 16 ఏళ్ల 76 రోజులు (స్వీడన్‌పై, 2026)
అలుసిన్ తురే (సియెర్రా లియోన్) – 16 ఏళ్ల 89 రోజులు (ఘనాపై, 2023)
టెన్జిన్ రబ్గే (భూటాన్) – 16 ఏళ్ల 118 రోజులు (చైనాపై, 2023)